
Valapateddu
వర్డ్స్వర్త్ని ప్రకృతి కవి అంటారు. కీట్స్ని మనిషి కవి అన్నారు. అయితే, “వర్డ్స్వర్త్ ప్రకృతిలో మనిషి ఉంటాడు. కీట్స్ మనిషిలో ప్రకృతి ఉంటుంది.” అంటాడు జి. కళ్యాణరావు. ఇప్పుడే రాస్తున్న రచయితని అట్లా పొల్చీ పెద్ద చేసి, అతనికి కొమ్ములు తెప్పించి అతనిలో కథకుడిని చంపేయడం ఉద్దేశం కాదు గాని, వివేక్ లంకమల కథలు చదివినప్పుడు కళ్యాణరావు ఎప్పుడో పంచుకున్న ఈ మాట గుర్తొచ్చింది. ఈ కథల్లో ప్రకృతినీ మనిషినీ భాగం చేశాడు వివేక్. నిజానికి చరిత్ర పొడుగుతా మనిషీ ప్రకృతీ వీడదీయలేనంతగా కలిసే ఉన్నాయి. అదే వివేక్ కథల్లో ప్రతిఫలిస్తుంది. ప్రకృతి ధర్మం ప్రకృతి చేసింది. మనిషి తన జీవిక కోసం తన ధర్మం నిర్వర్తించాడు. ఎప్పుడైతే మనిషి ప్రకృతి మీద ఆధిపత్యం చేయడానికి పూనుకున్నాడో ప్రకృతీ ప్రతిఘటించడం మొదలుపెట్టింది. కొండలు తొవ్వినప్పుడు కొండచరియలు విరిగిపడ్డాయి. అడవిని ధ్వంసం చేసినప్పుడు ఎండలు విజృంభించాయి. అడవుల్లో బతికే పులులూ, ఎలుగుబంట్లు, ఏనుగులు పల్లెల మీద పడ్డాయి. ఈ అకస్మాత్తు వరదలన్నీ ప్రకృతిపై మనిషి చేసిన అత్యాచారం తాలుకు ఫలితాలే. లంకమల దారులు అనే ట్రావెలాగ్లోనూ కథల్లో ఉండే శిల్పాన్ని సాధించిన వివేక్ రాసిన కథలివి. కథలు కాదని రాసిన వాటిల్లోనే కథ వుంటే, కథ అంటూ వస్తున్నదాంట్లో ఎంత వుండొచ్చు? మేం చదివాం. నచ్చాయి. మీరూ చదవండి. మునుపటికన్నా ప్రేమిస్తారు. - అరుణాంక్ లత ఎడిటర్, ఛాయ