
TEJO TUNGABHADRA
అవి 15వ శతాబ్దపు చివరి సంవత్సరాలు. బలిష్టులైన పోర్చుగీసు నావికులు ప్రాణాలను పణంగాపెట్టీ భారతదేశానికి సముద్రమార్గాన్ని కనిపెట్టారు. భారతదేశంలోని ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యపోయి యూరోప్‌లో స్వతంత్రంగా మిరియాల వ్యాపారం ప్రారంభం కావటానికి కారకులయ్యారు. ప్రపంచం మొత్తం వారి సాహసాన్ని కొనియాడింది. కాని ఈ చారిత్రక సంఘటనలు సామాన్య ప్రజల మీద ఎలాంటి పరిణామాన్ని కలిగించాయి? రాజకీయ, ధార్మిక చదరంగంలో సామాన్య ప్రజానీకం ఏ విధంగా నలిగిపోయింది? చరిత్రను సామాన్య జనుల దృష్టా చూడటం సాధ్యమా? ఈ చారిత్రక నవల పై ప్రశ్నలకు సామాన్య ప్రజానీకం ద్వారా జవాబులు ఇవ్వటానికి ప్రయత్నిస్తుంది. లిస్బన్ లో తమ మానాన తాము బతుకులను కూడగట్టుకుంటున్న యూదుల సముదాయం ఒకవైప్ర, అప్పటివరకు బీదరికాన్ని చవిచూసి, ఇప్పుడు మిరియాల వ్యాపారంతో తలెత్తుకు నిలబడిన క్యాథలిక్ సముదాయం మరోవైపు. ఈ పరిస్థితిలో యూదుల ఇంటి అందమైన ఆడపిల్లను క్యాథలిక్ ధర్మానికి చెందిన ఒక అబ్బాయి ఇష్టపడితే పరిణామమెలా ఉంటుంది? భారతదేశంలోని ఐశ్వర్యం వారి ప్రేమని నిరాటంకంగా కొనసాగనిస్తుందా? ఇదే పరిస్థితిలో లిస్బన్ తేజో నదిలో ఈదులాడే రెండు బంగారు చేపలు భారతదేశంలోని తుంగభద్రానదిని చేరటానికి ఓడవెక్కి కూర్చున్నాయి. ఇవి మరో నదిని చేరటం సాధ్యమా? ఒక నదిలో ఈదిన చేపలు మరో నది నీటిని తమదిగా చేసుకుంటాయా? ఎన్నో రోమాంచక దృశ్యాలతో అల్లిన ఈ మానవీయ కథనంలో అసంఖ్యాకమైన పాత్రలు రూపుదిద్దుకున్నాయి. వాటి నడుమ కొనసాగే జీవన నాటకము, మన సమకాలీన జీవితానికి భిన్నంగా కనిపించదు.