
Nallaregadi Nelallo
పాలగిరి విశ్వప్రసాద్ గ్రామ కక్ష అనే నిప్పులకొలిమిలో కాలి, వ్యవసాయమనే వైతరణిలో ఈది, స్వయంగా వాటిని అనుభవించి పలవరించి కథలు రాశాడు. సమాజాన్నీ రాజకీయాల్నీ నడిపించే ఆర్థిక మూలాలు, అగ్రకులాధిపత్యం, ఎస్సీ ఎస్టీల ఆక్రందన, మానవత్వం, అమానుషత్వం, స్త్రీ స్వేచ్ఛ, పురుషాధిక్యత - ఇవన్నీ కథల్లో చొప్పించి సజీవమైన మాండలికంలో రాశాడు. పాలగిరి విశ్వప్రసాద్ కు కరువెందుకొస్తుందో తెలుసు. రాయలసీమలో గ్రామ కక్షలకు కరువు కన్నతల్లి అని తెలుసు. రైతులు శ్రమకోడ్చి పండించే పంట తక్కువ ధరకు ఎందుకు తెగనమ్ముకుంటారో, పోలీసుల తాకిడి, కోర్టుకేసులు, రోడ్ల వెనకాల ప్రపంచీకరణ, హైవే ధాబాల చాటున జీవితాలు ఛిన్నాభిన్నం ఎందుకవుతాయో, దొంగతనాలకు పేరుపడ్డ కులాలు ఎవరివల్ల ఎందుకు అలాగే వుండిపోతాయో ఆ కారణాలన్నీ తెలుసు. అవేవీ తెలియని - ఒక ఒరవడిలో కొట్టుకుపోయే - అమాయక జీవుల్ని పాత్రలుగా చేసి సమకాలీన చరిత్ర సూక్ష్మంగా ఆవిష్కరింపజేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పాలగిరి విశ్వప్రసాద్ ప్రస్తుతంలో వుండి కథలు రాస్తున్న రచయిత. అందుకే పాలగిరి విశ్వప్రసాద్ కథలు నిజం చెబుతాయి. నిజాయితీగా చెబుతాయి. కథలు రాస్తున్న వాళ్ళు కూడా చదవాల్సిన కథలివి. -ఎన్. దాదాహయాత్, కథా రచయిత