GUNS AND MONSOONS
గన్స్ & మాన్సూన్స్ మహి బెజవాడ కథలు ఉద్దేశ్యాలు స్పష్టంగా ఉంచి కథనం తిరకాసు చేయడం అందరికీ రాదు. తిరగేసి కొట్టడం ఇది. చదరంగం అందరూ ఆడతారు. గడులకు ఇటుక రంగు, గోరింట రంగు పూసి ఆడుదాం అనుకోవడం ఇది. ప్లాస్టిక్ బాటిల్ మూతలను వాంతి చేసే హిమాలయాలు, వలస వచ్చి సముద్రంలో ఎప్పటికీ దిగని రొయ్యలు స్లమ్స్ తో నిండిన ఇసుక తీరాలు, సీలింగ్ ఫ్యాన్లను నెత్తి మీద పెట్టుకుని తిరిగే విద్యార్థులు, బంగారాన్ని విడిపించి ఇచ్చే వారున్నట్టుగానే తమ పాత జన్మలను ప్రభుత్వ ఖజానాల నుంచి విడిపించిమ్మని తిరిగే ఉద్యమకారులు, తాకట్టుకు సిఫార్సు చేయమని తిరిగే బుద్ధిజీవులు... ఇలాంటి సంకేతధారుల జాతర ఈ కథలేగానీ... వీరి మధ్య తిరుగుతూ కథకుడు అప్పుడప్పుడు ఉమ్మి ఎంగిలి తుడుచుకుంటున్నాడా అనిపిస్తుంది. అపభ్రంశ కథనంతో లాంగ్ ప్రోజ్ రాయడం చాలా కష్టం. సాధించాడు. బాగా తెలిసిన ముఖాన్ని మార్కెట్లోకి వచ్చిన సరికొత్త కెమెరాతో, ఫిల్టర్లతో అరె అనిపించేలా చేసే పనితనం ఈ కథనంలో ఉంది. నిన్నటి కొత్తలను నేడొక రోతలుగా చెప్పడం కూడా. మహి బెజవాడ తెలుగులో త్రిపుర, డా. వి. చంద్రశేఖరావు పరంపరను కొనసాగించగల కథకుడు అనిపిస్తున్నాడు. కథల ఎంపికలో ఇతని నిశ్చిత స్వభావం ఈ కలం గబుక్కున కుళాయి నీరు పట్టి రాయదు అని పరికించి చూసేలా చేస్తోంది. గుంపు నుంచి ఒక బాతు విడివడి బెకబెకమని ఇషారా చేస్తోంది. మడుగుల్లో చుట్ట చుట్టుకున్న పాముల గురించి ఏమో. ఇలాంటి కథకుడు ఉండాలి. - మహమ్మద్ ఖదీర్ బాబు