
Yerra Gabbilaala Veta
నిజమైన చీకటిని నేనెప్పుడు చూడలేదు, ఆ చీకటిని నేనెపుడు అనుభవించలేదు. అసలు చీకట్లో ఏముంటుంది? చీకటి నిజమైన రంగు, చీకటి రూపం, చీకట్లో వాన, చీకట్లో వాసన, చీకట్లో సంచారము, చీకట్లో వేట, చీకట్లో భూమి కదలిక, చీకట్లో సముద్రం, ప్రళయం ఇవన్నీ ఎవరైనా చూసారా? అర్ధరాత్రి అడవి మధ్యలో చీకట్లో కూర్చొని కళ్ళు తెరిచి చూస్తే ఏమి కనపడుతుంది? కళ్లుండి కూడా. అసలయిన చీకటిని నేనెపుడు చూడలేదు. ఎందుకు? నా ఊహలు అలా కాదు, చీకట్లో బాసిపట్లు వేసుకు కూర్చొని అక్కడ దేన్నో వెతుకుతాయి. ఆ చీకట్లోనే ఈ యెర్ర గబ్బిలాల వేట మొదలయ్యింది. ఆ వేటలో నేను నా ముత్తాతల తరానికి ఆయనకు ముందు తరాలలోకి దూకాను. కళ్ళు మూసుకొని కలలు కంటూ ఆ తరంలోకి నేను ప్రవేశించాను. అప్పటి మనుషులను వారి మనస్తత్వాలను, ప్రాంతాలను వారి ప్రాంతీయతను. జీవన సౌందర్యాన్ని పీడితులు దౌర్జన్యాన్ని, కలిసున్న కుటుంబాలని కలగాపులగం అవుతున్న తెగలను చూశాను, వాళ్ళతో సంవత్సరంకు పైగా గడిపాను, అక్కడ కనిపించాయి నాకు ఈ యెర్రగబ్బిలాలు.