
Ententa Dooram
ఇవేం గొప్ప కథలు కాదు... తలకిందలయ్యే సంఘటనలూ లేవు... ఆశ్చర్యపరిచే మలుపులు లేవు... మెస్మరైజింగ్ ముగింపులు లేవు... కానీ ఒక్కొక్క కథ వెనక ఓ ఊపిరి ఉంది... ఓ నిశ్శబ్దం ఉంది... ఒక చిన్న తడబాటు ఉంది. మాటల్లో చెప్పలేని సున్నిత భావాలు, మౌనంగా మిగిలిపోయిన బరువైన క్షణాలు ఈ కథలు. లక్ష్మీ ప్రియాంక తన పుస్తకంలో నెమలిపించంతో పాటు పదునైన గాజు పెంకుని కూడా దాచుకుంది. ఇవి కథలు కావు... భావాలు! మన మనసుల్లో ఎన్నోసార్లు మాటలుగా రూపం దాల్చలేకపోయిన ఊహలు, ముగించలేక మిగిలిన కొన్ని బంధాలు, చెప్పలేక మిగిలిన కొన్ని ప్రేమలు, చిరునవ్వుల వెనక పడిపోయిన కొన్ని కన్నీటి చుక్కలు. మరెక్కడా చదవలేనంత కొత్త కథలేం కాదు, ఇంకెక్కడా అనుభవించలేనంత అనుభూతులు కావు, ఇవి పెద్ద ప్రకంపనలు కావు అనిపించే చిన్న కథలు. వేచిచూసే ఒక చూపు, తలవంచి ఆపుకున్న చిరునవ్వు, వదిలేసినా కాలంలో మిగిలిపోయిన చూపుల్లాగా మనల్ని గుచ్చుతూ ఉంటాయి. మనసుతో చదవాల్సిన కథలు. ఈ కథల్లో ఎక్కడో దాక్కున్న మిమ్మల్ని మీరు కలుసుకుంటారు, ఎప్పుడో కలిసిన ఓ ఆత్మీయుడ్ని గుర్తు చేసుకుంటారు. కొన్నింట్లో ప్రేమ మొదలవుతుంది. కొన్నింట్లో ప్రేమ సాగుతుంది. మరికొన్నింట్లో ప్రేమ ఆగిపోతుంది. కొన్ని కథలు పూర్తవ్వవు. కానీ అసంపూర్ణంగా మిగిలిన కథల్లోనే ఎక్కువగా భావాలు మిగిలిపోతాయి కదా! చెప్పాలనుకున్న చివరి మాటను ఒక చిరునవ్వుతో వదిలేసినట్టు. వదిలేసిన ఆ మాటే మనలో ఎక్కువకాలం నిలిచిపోతుంది. ఈ కథలు మీరు చదవకపోయినా ప్రపంచానికి ఏమీ జరుగదు. చదివాక మాత్రం ప్రియాంక మీ హృదయాన్ని తాకుతుంది... మీ మనసులో ఓ మూలన జ్ఞాపకాల పక్కన ఓ చిన్న కప్పు కాఫీ పెట్టి కూర్చుంటుంది. -భరత్ కమ్మ (డియర్ కామ్రేడ్ చిత్ర దర్శకులు)